తాగు నీటికి వాటర్  గ్రిడ్

శ్రీకాకుళం,  : జిల్లాలో తాగు నీటికి వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటుపై మంగళ వారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ సూచనల మేరకు 2050 సంవత్సరం నాటికి తాగు నీటి కొరత లేకుండా పూర్తి సమాచారంతో డి.పి.ఆర్ లను రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో లభ్యంగా ఉన్న జలవనరులు, 2050 నాటికి ప్రజల తాగు నీటి అవసరాలు, పరిశ్రమలు, పశువులు, నూతనంగా ఏర్పడే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా డి.పి.ఆర్ ఉండాలని ఆదేశించారు. హిరమండలం, ఆఫ్ షోర్, మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లతోపాటు ఇతర జలవనరులను పరిగణనలకి తీసుకోవాలని ఆయన సూచించారు. వాటర్ గ్రిడ్ ప్రణాళికలు పూర్తి స్ధాయిలో రూపకల్పన జరిగినపుడు దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని, ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టరాదని ఆయన స్పష్టం చేసారు. పలాస వద్ద ఎం.ఎస్.ఎం.ఇ పార్కు వస్తుందని దాని అవసరాలను సైతం పొందుపరచాలని అన్నారు. శ్రీకాకుళం నగర అవసరాలు, ట్రిపుల్ ఐ.టి, అంబేద్కర్ విశ్వవిద్యాలయం తదితర అవసరాలను సైతం పరిశీలించాలని సూచించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు టి.శ్రీనివాస రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోగల ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే జిల్లాకు 2050 నాటికి అవసరమగు తాగు నీటి జలవనరులను సమకూర్చుటకు సమగ్రంగా డిపిఆర్ ను తయారు చేస్తున్నామని చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలు ప్రాజెక్టుకు అవసరమౌతాయని అంచనా ఉందని తెలిపారు. ఇచ్ఛాపురం, పలాస ప్రాంతాలకు ఆఫ్ షోర్ రిజర్వాయర్ నుండి, టెక్కలి ప్రాంతానికి హిరమండలం ప్రధాన ఎడమ కాలవ నుండి, పాలకొండ ప్రాంతానికి తోటపల్లి, రాజాం ప్రాంతానికి మడ్డువలస రిజర్వాయర్ నుండి నీటిని వినియోగించుకొనుటకు అవకాశాలు పరిశీలిస్తున్నామని వివరించారు. జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు బి.రాంబాబు మాట్లాడుతూ మహేంద్ర తనయ నదికి సోంపేట దక్షిణ దిశలో రిజర్వాయర్ నిర్మించుటకు అవకాశం ఉందని, తద్వారా కొంత మేర ఆ ప్రాంత తాగు నీటి అవసరాలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ బి.గోపాలకృష్ణ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్టు, ఆర్ అండ్ ఆర్ కాలనీ తాగు నీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు సైతం వాటర్ గ్రిడ్ డి.పి.ఆర్ లో చేర్చడం అవసరమని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు,  ప్రజా ఆరోగ్య శాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర రావు తదితరులు పాల్గొన్నారు.జిల్లా పౌరసంబంధాల అధికారి, శ్రీకాకుళం

×

Hello!

Click one of our Representatives below to chat on WhatsApp or send us an email to zenithangle365@gmail.com

× How can I help you?